Rice Water Uses: అన్నం వండే ముందు బియ్యం కడిగిన నీళ్లను (Rice Water) చాలామంది పారేస్తుంటారు. కానీ ఈ నీళ్లలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి అనే సంగతి చాలామందికి తెలియదు. అయితే ఈ నీటిని పారవేయకుండా వంటల్లో వాడితే ఆ ఫుడ్ చాలా రుచిగా మారుతుంది. వీటిలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. మిల్లెట్, క్వినోవా లేదా ఓట్స్ వండే సమయంలో మామూలు నీటికి బదులు బియ్యం (Rice) కడిగిన నీళ్లను ఉపయోగించాలి.
ఈ నీళ్లు వాటికి ప్రత్యేకమైన రుచిని తెచ్చి పెడతాయి. పోషక విలువలు కూడా బాగా లభిస్తాయి. నీళ్లలో ఉండే పిండి పదార్థాల వల్ల గింజలు చాలా మెత్తగా, గుల్లగా ఉడుకుతాయి. సాధారణంగా ఈ వంటకు ఎంత నీళ్లు ఉపయోగిస్తారు అంతే బియ్యం కడిగిన నీటిని ఉపయోగించాలి. స్మూతీస్, షేక్స్ లలో కూడా బియ్యం నీళ్లు (Water) ఉపయోగించుకోవచ్చు. వీటిలో పాలు లేదా పెరుగు కలపకుండా బియ్యం నీళ్లు పోయాలి.
దీంతో మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. అరటి పండ్లు, మామిడి పండ్లు, బెర్రీలు వంటి వాటితో బియ్యం నీళ్లు కలపొచ్చు. వీటిలో చియా గింజలు లేదా బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు. ఇది చాలా ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ లేదా వ్యాయామం తర్వాత మంచి ఎనర్జీ డ్రింక్ అవుతుంది. సూప్ చేసుకునేటప్పుడు కూడా బియ్యం కడిగిన నీళ్లను ఉపయోగించవచ్చు. దీంతో సూప్ కు చాలా కమ్మటి రుచి వస్తుంది.